కొఠారీ గ్రామానికి చెందిన బుడ్డేపు రామారావు, పార్వతిల ఒక్కగానొక్క కొడుకు రాజేష్ (చూడామణి) (28). ఈయన విదేశాల్లో కూలీగా పని చేస్తుండేవాడు. కోవిడ్ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చేశాడు. ఈ ఏడాది జూన్ 12వ తేదీన ఇచ్ఛాపురం పట్టణం బెల్లుపడకు చెందిన జయ(26)తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ప్రస్తుతం జయ గర్భిణి. అయితే ఆమెకు ఆదివారం సాయంత్రం కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఇచ్ఛాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కడుపు నొప్పి తీవ్రం కావడంతో వైద్యుల సూచనల మేరకు హుటాహుటీన బరంపురం పెద్దాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగా ఫిట్స్ రావడంతో జయ కన్నుమూసింది. మృతదేహాన్ని కొఠారీ గ్రామానికి సోమవారం తీసుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు.
కళ్లెదుటే భార్య మృతి చెందడంతో భర్త రాజేష్ జీర్ణించుకోలేకపోయాడు. మంగళవారం ఉదయం ఈదుపురంలో టిఫిన్ చేస్తానంటూ ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి ఇచ్ఛాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు, ఇచ్ఛాపురం–ఈదుపురం క్రాస్ రోడ్డు పక్కనే తన వాహనాన్ని ఉంచి డివైడర్‌పై కూర్చొని వేదనకు గురయ్యాడు. బరంపురం నుంచి పలాస వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం కింద పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడకక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా కేసు నమోదు చేశారు. రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు.