నీటిలో మునిగి వ్యక్తి మృతి

నీటిలో మునిగి వ్యక్తి మృతి

పొట్టకూటి కోసం ట్రాక్టర్‌ డ్రైవర్‌ పనిచేస్తున్న ఓ దినసరి కూలీని రాళ్లవాగు మింగేసింది. ఇసుక తోడేందుకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన కనుకుంట్ల దుర్గయ్య తన ట్రాక్టర్‌ ద్వారా ఇసుక సరఫరా చేస్తుంటాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు ఇసుక తరలించేందుకు బొంతల శంకర్‌ తోపాటు మరో ఇద్దరు కూలీలను తీసుకెళ్లాడు.

ఉదయం 9 గంటల సమయంలో శంకర్‌ నీటిలో మునిగి మృతి చెందాడని, వెంట వెళ్లిన కూలీలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శంకర్‌ అనారోగ్యంతో ఉన్నా ట్రాక్టర్‌ యజమాని బలవంతంగా పనిలోకి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మృతదేహంతో ట్రాక్టర్‌ యజమాని దుర్గయ్య ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన దిగారు.

సమాచారం అందుకున్న ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య పప్పి, ఇద్దరు కుమార్తెలు హేమలత, యేసుమణి, కుమారుడు ఏసుమంత్‌ ఉన్నారు.

రాళ్లవాగు నీటి నుంచి అక్రమంగా ఇసుక తోడుతున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్‌ యజమానులు కూలీలతో ప్ర మాదకరంగా నీటి అడుగుభాగం నుంచి ఇసుక ను వెలికితీస్తున్నారని వారు పేర్కొంటున్నారు. రోజుకు వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ప్రమాదకరంగా వాగుల నుంచి ఇసు క తోడుతున్న ట్రాక్టర్‌ యజమానులపై కఠిన చ ర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.