కోటి రూపాయల బీమా పాలసీ తీసుకున్న భర్త రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యాక్సిడెంట్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ముగించారు. అయితే అప్పటి వరకూ ఎలాంటి అనుమానాలు రాలేదు కానీ ఆయన భార్య తన భర్త బీమా సొమ్ము ఇవ్వాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లడంతో షాకింగ్ విషయం బయటపడింది. ఏజెంట్, ఇన్సూరెన్స్ ఆఫీసర్ విచారణకు వెళ్లడంతో అనుమానాలు రేగాయి. అవి మృతుడి సోదరుడికి చెప్పడంతో భార్య బాగోతం బయటపడింది. ఎనిమిదేళ్ల తర్వాత మరోమారు విచారణ ప్రారంభించిన ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
లాతూరు జిల్లాకు చెందిన అన్నారావు బన్సోడే 2012లో బధల్‌గావ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమాద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కేసును మూసేశారు. అయితే అన్నారావు పేరిట ఉన్న కోటి రూపాయల బీమా సొమ్ము కోసం భార్య జ్యోతి బన్సోడే ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించారు. విచారణలో భాగంగా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు స్పాట్‌కి వెళ్లి పరిశీలించడంతో వారికి అనుమానాలు రేగాయి. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించి తమను మోసం చేసి కోటి రూపాయలు కాజేసేందుకు ప్రయత్నించారంటూ పోలీసులను ఆశ్రయించారు.
అనంతరం మృతుడి సోదరుడు భగవత్ బన్సోడే తన వదిన జ్యోతి బన్సోడేకి వ్యతిరేకంగా పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ రమేష్ వివేకి, అతని స్నేహితుడు గోవింద్ సుబోధితో కలసి కుట్రపూరితంగా హత్య చేసి ఉంటారని.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ జరపాలని ఫిర్యాదులో కోరారు. అతని ఫిర్యాదు మేరకు 2014లో కేసు నమోదైంది. అయినా ఔసా పోలీసులు ఆమెపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
అప్పటి నుంచి మరుగున పడిన కేసు మూడు నెలల కిందట మరోమారు తెరపైకి వచ్చింది. లాతూరు ఎస్పీ నిఖిల్ పింగాలే ఆదేశాల మేరకు విచారణ ప్రారంభమైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య జ్యోతి బన్సోడేను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆమె కోర్డు ఆదేశాల మేరకు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. కేసు కొనసాగుతోంది.