ధాన్యం కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ధర్నా కోసం ఫ్లెక్సీ కడుతూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ధర్నా నిమిత్తం కోదాడ బంజారా కాలనీకి చెందిన కందుకూరి సునీల్ అనే యువకుడు తన స్నేహితుడు కుడుముల వెంకటేష్‌తో కలిసి పట్టణంలోని రంగా థియేటర్ వద్ద గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫ్లెక్సీలు కడుతున్నాడు.
ఆ సమయంలో పక్కనే ఉన్న 11కెవి హైఓల్టేజీ కరెంట్ తీగలు తగలడంతో సునీల్, వెంకటేశ్‌కు షాక్ కొట్టి కింద పడిపోయారు. ఇద్దరినీ ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా సునీల్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వెంకటేశ్‌కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన 40 నిమిషాల వరకు సునీల్ ప్రాణాలతోనే ఉన్నాడని, డాక్టర్లు సరైన వైద్యం అందించకే చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ నేతల కారణంగానే సునీల్ చనిపోయాడని, అతడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రంగ చౌరస్తాలో బంధువులు, స్థానికులు ఆందోళన చేపట్టారు.