పోలీస్‌ కస్టడీలో యువకుడు మృతి

పోలీస్‌ కస్టడీలో యువకుడు మృతి

పోలీస్‌ కస్టడీలో ఉన్న ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. నిందితుడి మరణాన్ని పోలీసులు ఆత్మహత్యగా చెబుతుంటే.. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం అతనిది హత్యేనని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మంగళవారం(నవంబర్‌9) చోటుచేసుకుంది. మృతి చెందిన యువకుడిని సదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన అల్తాఫ్ కుమారుడు చాంద్ మియాన్‌గా గుర్తించారు. వివారల్లోకి వెళితే.. యువతిని తీసుకొని పారిపోయిన కేసులో విచారించేందుకు యువకుడు అల్తఫ్‌ను పోలీసులు సోమవారం ఉదయం కస్‌గంజ్‌కు చెందిన సదర్‌ కొత్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

పోలీసులు యువకుడిని విచారణ చేస్తున్న క్రమంలో బాత్రుంకు వెళ్లాలని అడిగాడు. బాత్రూమ్‌ లోపలికి వెళ్లిన అతను లోపల నుంచి లాక్‌ వేసుకున్నాడు. కాసేపటి తరువాత ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు బాత్రూమ్‌ తలుపు తెరిచి చూడంతో నిందితుడు తన జాకెట్‌ హుడ్‌ను పైప్‌కు కట్టి గొంతు చుట్టూ బిగించుకొని ఉన్నాడు. వెంటనే పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. అయితే ప్రాథమిక విచారణలో నిర్లక్ష్యం వహించినందుకు అయిదుగురు పోలీసులను ఎస్పీ రోహన్‌ సస్పెండ్ చేశారు. వీరిలో కసన్‌గంజ్‌ స్టేషన్‌ అధికారి, ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఉన్నారు.

కాగా లాకప్‌లో ఉన్న తన కొడుకును పోలీసులే ఉరి తీశారని నిందితుడు అల్తాఫ్‌ తండ్రి చాహత్ మియా ఆరోపించారు. అల్తాఫ్ మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం తన కొడుకును పోలీసులు తీసకెళ్లారని. తరువాత 24 గంటలకే అతను ఉరి వేసుకున్నాడని సమాచారం ఇచ్చారని తెలిపారు. పోలీసులు కొడుకును జిల్లా ఆసుపత్రికి తరలించారని, అక్కడ వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారని ఆయన చెప్పారు. అంతేగాక యువకుడి లాకప్‌ మరణంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి.