‘మీరు బయల్దేరి ఉండండి..ఊరెళ్లిపోదాం. ఈ లోగా బండికి పెట్రోల్ కొట్టించుకుని వస్తాను’ అని చెప్పిన వ్యక్తి కాసేపటికే లారీ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మండల పరిధి పెనుబాక గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదం ఆ గ్రామంలో విషాద ఛాయలు నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం గ్రామానికి చెందిన కొయ్యాన హేమసుందర్ (32) తన అత్తగారి గ్రామమైన పెనుబాక గ్రామానికి తన భార్య మల్లేశ్వరి, ఇద్దరు పిల్లలతో వచ్చారు.
మధ్యాహ్నం వచ్చిన వీరు సాయంత్రం స్వగ్రామం తిరిగివెళ్లిపోదామని బయల్దేరారు కూడా. ఇంతలో బండికి పెట్రోల్ కొట్టించుకుని వస్తానని బయటకు చెప్పి హేమసుందర్ బయటకు వెళ్లారు.బండిలో ఆయిల్ వేసి వెళ్తుండగా చీపురుపల్లి నుంచి రాజాం వైపు వస్తున్న లారీ ఢీ కొనడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించడంతో అంతవరకు ఆనందంగా గడిపిన వారంతా కన్నీరుమున్నీరుగా రోదించారు. అంతవరకు తమతో సరదాగా గడిపిన హేమసుందర్‌కు ఇలా జరిగిందని తెలిసి రోదించారు. మృతుని భార్య మల్లీశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పి.సూర్యకుమారి తెలిపారు.