భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇస్తున్నారు. వైద్య సిబ్బంది,పారిశుధ్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. మరికొందరు మృతిచెందారనే వార్తలు సైతం ఆందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా , తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి చనిపోయాడు.
ఇవాళ వ్యాక్సినేషన్ హాలీడేగా ప్రకటించిన సర్కార్.. రేపటి నుంచి మళ్లీ వ్యాక్సిన్ వేయనుంది.. అయితే, నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఒలా గ్రామానికి చెందిన విఠల్ రావు అనే వ్యక్తి మృతిచెందారు. 108 అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న విఠల్‌రావు.. మంగళవారం కుంటాల పీహెచ్సీలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే వ్యాక్సినేషన్ తర్వాత నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆయనను వెంటనే కుటుంబసభ్యులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విఠల్ మృతిచెందారు.
అయితే విఠల్ రావు మృతికి వ్యాక్సిన్ కారణం కాదంటున్నారు డాక్టర్లు. అతడు గుండేపోటు చనిపోయాడంటున్నాయి అధికార వర్గాలు. కరోనా వ్యాక్సిన్ కు సంబందం లేదని చెబుతున్నారు. విఠల్ రావు మరణంపై విచారణ కోసం కమీటీ ఏర్పాటు చేశారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఆధారంగా నివేదిక సమర్పించనున్నారు నిపుణులు. జిల్లా నిపుణుల ఇచ్చే నివేదికను ఎఈఎఫ్ఐ కమీటీ నిపుణల బ్రుందం పరిశీలించనుంది. దీంతో వ్యాక్సినేషన్‌కు కొందరు వెనుకడుగు వేస్తున్నారు. ఎక్కడ తాము అనారోగ్యంబారిన పడతామోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.