పెళ్లిరోజు నాడే దంపతులపై విధి వక్రించి వారిద్దరినీ వేరు చేసింది. బంధువుల ఇంట హాయిగా ఆనందంగా గడుపుదామనుకున్న వారి ఆశల్ని చిదిమేసింది. కుటుంబ సభ్యులతో కలసి వెళుతున్న ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని లారీ మృత్యువు రూపంలో వెంటాడి భర్తను బలితీసుకోగా, కుమార్తెకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.విజయవాడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కేశాని అమరేశ్వరరావు (32) ఘంటసాల మండలం చిట్టూర్పు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం దుర్మరణం చెందాడు.
ఈ ప్రమాదంలో భార్య లావణ్యకు, కుమార్తె భవిష్యకు గాయాలు కాగా ఏడాదిన్న కుమారుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మొవ్వ మండలం గూడపాడుకు చెందిన అమరేశ్వరరావు మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెంలోని అత్తమామల దగ్గర నుంచి బయలుదేరి స్వగ్రామమైన మొవ్వ మండలం గూడపాడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా చల్లపల్లి వైపు వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ఘటనలో అమరేశ్వరరావు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం అక్కడికి చేరుకున్న అంబులెన్స్ గాయాలపాలైన భార్య లావణ్య, కుమార్తె భవిష్యను ఆస్పత్రికి తరలించారు.