మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో విషాదం చోటు చేసుకుంది.. భార్య కాపురానికి రావడం లేదంటూ సెల్ టవర్ ఎక్కిన ఓ భర్త.. చివరకు కిందకు దిగుతూ ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు.. జడ్చర్ల పాత బస్టాండు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. పాతబజారుకు చెందిన కాగుల యాదయ్య , నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహిళను ఎనిమిదేళ్ల కింద పెళ్లి చేసుకున్నాడు.
అయితే కొంతకాలంగా యాదయ్య మద్యానికి బానిసయ్యాడు.. దీంతో అతడి భార్య దీన్ని భరించలేక కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈక్రమంలోనే బుధవారం మద్యం తాగిన మైకంలో యాదయ్య సెల్ టవర్ ఎక్కాడు. కాపురానికి రాకపోతే కిందకు దూకి చనిపోతానంటూ బెదిరించాడు.ఈ క్రమంలోనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు అతడిని సముదాయించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఓ వ్యక్తి మద్యం బాటిల్‌ను చూపించడంతో యాదయ్య ఆశతో సెల్ టవర్ దిగబోయాడు.. అయితే టవర్‌కు ఉన్న నిచ్చెన మీదుగా కాకుండా రాడ్ల మీదుగా దిగుతూ ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. సుమారు 30 అడుగుల ఎత్తుపై నుంచి కిందపడటంతో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు..