స్నేహితురాలి వెంటపడి వేధించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు… మణికొండలో నివాసం ఉంటున్న యువతి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటుంది. బండ్లగూడ సమీపంలోని సన్‌సిటీలో నివాసం ఉంటున్న సమయంలో ఆమెకు పరిచయం ఉన్న రవికిరణ్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమె వెంటపడి వేధిస్తున్నాడు. ఇటీవల ఆమెను వెంబడించడంతో పాటు చంపేస్తానంటూ బెదిరించడంతో రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.
ఇదిలా ఉండగా ఈ నెల 24న సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లోని గాయత్రీహిల్స్‌లో బ్యూటీ పార్లర్‌కు వచ్చిన యువతిని బయటకు లాక్కొచ్చిన రవికిరణ్ తనతో పాటు రావాలని కారులోకి లాక్కున్నాడు. ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో తప్పించుకుని పారిపోయింది. ఈ మేరకు బాధితురాలు శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు రవికిరణ్‌పై ఐపీసీ 354(ఏ), (డి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.