అది చాలా విలువైన రాయి

అది చాలా విలువైన రాయి

అది మామూలు రాయని అందరూ అంటుంటే.. తన మనసు మాత్రం కాదని చెబుతోంది. అది చాలా విలువైన రాయని, ఎందుకో తనకు అదృష్టం ఈ రాయి రూపంలోనే వరించబోతోందని గాఢంగా నమ్మాడు. ఎన్నో సంవత్సరాలుగా తన ఇంట్లో భద్రపరిచాడు కూడా. చివరికి తన నమ్మకమే నిజమైంది..ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన డేవిడ్‌ హోల్‌కు అక్కడి స్థానక పార్కులో 2015లో 17 కేజీల రాయి దొరికింది.

అప్పటినుంచి అది బంగారమై ఉంటుందని తన ఇంట్లోనే భద్రపరిచాడు. తనకు దొరికిన రాయిని పగలగొట్టడానికి డ్రిల్‌ మిషన్‌తో సహా ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. చివరికి యాసిడ్‌లో వేశాడు కూడా.. కానీ దానిని పగులగొట్టి, లోపల ఏముందో చూడలేకపోయాడు. చేసేదిలేక ఆ రాయిని తీసుకుని మెల్‌బోర్న్‌లో ఉన్న మ్యూజియంకు తీసుకెళ్లాడు. ఐతే జియాలజిస్టుల పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. ఎందుకంటే సదరు రాయి మామూలుది కాదుమరి!

అవును.. అంతరిక్షం నుంచి భూమిపై పడ్డ అరుదైన ఉల్క అది. సుమారు 460 కోట్ల సంవత్సరాలనాటిది. బంగారం కంటే కూడా ఎన్నోరెట్లు విలువైనది. ఈ విషయం తెలుసుకున్న డేవిడ్‌ ఎగిరి గంతేశాడు.19వ శతాబ్ధంలో అనేక బంగారం రాళ్లు ఈ ప్రాంతానికి తీసుకురాబడ్డాయి. ఈ పార్కులో బంగారం దొరుకుతుందని అక్కడి స్థానికుల నమ్మకం. అంతేకాదు ఈ పార్కులో దొరికిన ఏ వస్తువునైనా సందర్శకులు తమ ఇళ్లకు తీసుకెళ్లొచ్చు కూడా. డేవిడ్‌ కూడా తనకు దొరికిన రాయిని ఇంటికి తీసుకెళ్లాడు.. ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయాడు.