80 ఏళ్ల వృద్ధుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. అన్ని రోజుల మంచివాడిగా కనిపించిన ఆ వృద్ధుడి వికృత ఆలోచనలు తెలిసిన తర్వాత నిందితుడు కుదురుగా ఉండలేకపోయాడు. వృద్ధుడు తన భార్య గురించే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో వృద్ధుడిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గుట్టుగా మాయం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ సీసీటీవీ ఫుటేజ్‌తో పోలీసులకు చిక్కాడు. గత నెలలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
షమాకాంత్ తుకరామ్ నాయక్(80) అనే వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు అతడి సొంతం. ఉల్వే ప్రాంతంలో అతడికి చాలా ఆస్తులు, ప్లాట్లు, భూములు ఉన్నాయి. ఈ క్రమంలో నాయక్‌కు నవీ ముంబై ప్రాంతంలో ఉండే నిందితుడితో పరిచయం ఏర్పడింది. నిందితుడు ఆ ప్రాంతలో చిన్న దుకాణం నడుపుతూ ఉండేవాడు.
ఈ క్రమంలో నాయక్ ప్రతిరోజు నిందితుడి షాప్ దగ్గరకు వెళ్లి.. పలకరిస్తూ ఉండేవాడు. పెద్ద వయసు వ్యక్తి కావడం.. ప్రతి రోజు షాప్ దగ్గరకు వచ్చి పలకరిస్తుండటంతో నిందితుడు.. నాయక్‌ని మంచివాడిగా భావించాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత నాయక్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. 80 ఏళ్ల వయసులో కూడా కామంతో కళ్లు మూసుకుపోయి.. నిందితుడి భార్య మీద కన్నేశాడు.
అంతటితో ఆగక ఏకంగా తన వికృత ఆలోచన గురించి ఏకంగా నిందితుడితోనే చెప్పాడు నాయక్. ఈ క్రమంలో ఆగస్టు 29న నాయక్ నిందితుడి షాప్ వద్దకు వచ్చాడు. పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత ఉన్నట్లుండి నాయక్ ‘‘నీకు పది వేలు ఇస్తాను.. నీ భార్యను నా గోడౌన్‌కు పంపు.. నాకు ఆమెతో గడపాలని ఉంది’’ అని నిందితుడిని కోరాడు. అన్ని రోజులు ఎంతో మంచివాడిగా భావించిన వ్యక్తి ఇంత నిచంగా మాట్లాడేసరికి నిందితుడు తట్టుకోలేకపోయాడు. నాయక్‌ను తోసేశాడు. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్రంగా గాయలయ్యాయి. ఆ తర్వాత షాప్ షట్టర్ క్లోజ్ చేసి.. నాయక్‌ని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత వృద్ధుడి మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో ఉంచాడు.
ఆగస్టు 31 వరకు నాయక్ మృతదేహాన్ని బాత్రూంలోనే దాచాడు నిందితుడు. దుర్వాసన వచ్చి దొరికిపోతాననే భయంతో ఆగస్టు 31న నాయక్ మృతదేహాన్ని ఒక బెడ్‌షీట్‌లో చుట్టి.. బైక్ మీద తీసుకెళ్లి ఓ కాల్వలో పడేశాడు. అయితే ఈ తతంగం అంతా సీసీటీవీలో రికార్డయ్యింది. అయితే అప్పటికే నాయక్ కుటుంబ సభ్యులు.. అతడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే నిందితుడు నాయక్ కుమారుడితో కలిసి వెళ్లి.. అతడు తప్పిపోయినట్లు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.
అప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 29న ఏం జరిగిందని ఆరా తీయగా.. నాయక్ చివరి సారిగా నిందితుడి షాప్ దగ్గరే కనిపించాడని.. ఆ తర్వాత మిస్సయినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితుడి షాప్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నాయక్‌ని చంపడానికి గల కారణలు వెల్లడించాడు. అతడిని హత్య చేసిన తర్వాత నాయక్ దుస్తులను, మొబైల్‌ని స్విచ్ఛాఫ్ చేసి పడేసినట్లు తెలిపాడు.