తల్లిదండ్రులకు చెందిన మంచం కోసం కొట్టుకున్న అన్నదమ్ములు, ఆ కొట్లాట శృతిమించడంతో ఒకరి ప్రాణం తీసింది. ఎంతకూ మంచం తనకి ఇస్తానని అన్న చెప్పకపోవడంతో తమ్ముడు కర్రతో కొట్టి అన్నను హత్య చేసిన సంఘటన లేబర్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం నగరంలోని లేబర్‌కాలనీ ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలో విద్యుత్ లైన్‌మన్ ఇమ్మడి భాను ప్రకాష్(43) తన అన్నదమ్ములకు తల్లిదండ్రులు ఆస్తులు పంచగా మిగిలిన డెకోలం మంచం తమ్ముడైన ఇమ్మడి రాములు ఇంట్లో ఉంది.
ఆ మంచాన్ని తీసుకెళ్లేందుకు మంగళవారం సాయంత్రం సుమారు 6.30 గంట ల ప్రాంతంలో అన్న ఇమ్మడి భానుప్రకాష్ వచ్చాడు. ఈ క్రమంలో తమ్ముడు రాములుకు భానుప్రకాష్ కు మధ్య తీవ్రం వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహం చెందిన రాములు అక్కడే ఉన్న కర్రతో అన్న భానుప్రకాష్ తల, కాళ్లమీద కొట్టాడు. దీంతో అపస్మారక స్తితిలోకి వెళ్లిన భానుప్రకాష్‌ను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రాములు పరారీలో ఉన్నాడు.