భార్యతో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడిపై అనుమానం పెంచుకొని హత్య చేశాడు తోటి మిత్రుడు. కేసు వివరాలను డీసీపీ నారాయణరెడ్డి బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆత్మకూర్(ఎం) మండలం కొరటికల్‌కు చెందిన పెద్దిటి అశోక్‌రెడ్డి, చిన్నం అర్జున్, బండ సురేష్ స్నేహితులు. అశోక్‌రెడ్డి 2012లో ఇదే మండలం మోదుగుగూడెం గ్రామానికి చెందిన శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఇతని స్నేహితుడు చిన్నం అర్జున్ తరచు అశోక్‌రెడ్డి ఇంటికి వస్తుండే వాడు. ఇద్దరు కలిసి మద్యం సేవిస్తుండేవారు. కాగా ఆరు నెలల క్రితం తన భార్యతో అర్జున్ మాట్లాడుతుండగా అశోక్‌రెడ్డి గమనించాడు. అర్జున్ ప్రవర్తనపై అనుమానం పెంచుకొని అతన్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. జరిగిన విషయాన్ని మరో స్నేహితుడైన బండ సురేష్‌కు చెప్పాడు. అర్జున్ తన భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని అతన్ని చంపడానికి సహకరించాలని కోరడంతో సురేష్ ఒప్పుకున్నాడు.
అదే విధంగా అశోక్‌రెడ్డి తన మామ ఉడుత నర్సింహ, బావమరిది ఉడుత నవీన్‌కు కూడా ఈ విషయాన్ని చెప్పి తనకు సహకరించాలని కోరాడు. ఈ క్రమంలో అర్జున్ కదలికలపై నెల రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నారు. ఈ నెల 14 రాత్రి 8 గంటల సమయంలో అర్జున్ వద్దకు సురేష్ వెళ్లాడు. మద్యం తీసుకొని అశోక్‌రెడ్డి షెడ్డు వద్దకు రావాలని సూచించాడు. అతని మాటలు నమ్మిన అర్జున్.. మద్యం తీసుకొని అశోక్‌రెడ్డి ఇంటికి బయలుదేరాడు. సమీపంలోకి రాగానే అతని వెనకాల అశోక్‌రెడ్డి, సురేశ్, శిరీష, ఉడుత నర్సింహ, నవీన్‌తో పాటు మరో వ్యక్తి మల్లెమాల శ్రీశైలం ద్విచక్రవాహనాలపై రావడంతో అర్జున్‌కు అనుమానం వచ్చింది.
తప్పించుకునే ప్రయత్నిస్తుండగా అశోక్‌రెడ్డి తన వెంట తెచ్చుకున్న కర్రతో అర్జున్ ముఖంపై మోదడంతో అతను కిందపడిపోయాడు. మిగతా వారిని చుట్టూ కాపలా ఉంచి అర్జున్ చాతిపై విక్షణరహితంగా కర్రతో కొట్టాడు. అర్జున్ మృతి చెందినట్లు నిర్థారించుకొని అక్కడినుంచి వెళ్లిపోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిదితులనుంచి ఐదు సెల్‌ఫోన్లు, మూడు బైకులు, హత్యకు ఉపయోగించిన కర్ర, చేతి కడియం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఏసీపీ శంకర్ పాల్గొన్నారు.