ఆరోగ్య సమస్యల కారణంగా భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ ఘటన కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకర్‌గారి సిద్ధయ్య (60), బాలమణి (58) దంపతులు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బాలమణికి ఐదేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది.
అప్పటి నుంచి ఎన్ని ఆస్పత్రులు తిరిగినా తగ్గలేదు. ఉన్నచోటే ఆమెకు సపర్యలు చేస్తున్నారు. సిద్ధయ్య కూడా గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడికి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. జీవితంపై విరక్తితో భార్యను చంపి తాను కూడా చనిపోతానని సిద్దయ్య పలుమార్లు కుటుంబ సభ్యులతో అనేవాడు.
సోమవారం రాత్రి కొడుకు రాజు, కోడలు, మనవళ్లు అందరితో కలసి భోజనం చేసి పడుకున్నారు. కొడుకు రాజు ఉదయం లేచి చూసే సరికి తండ్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. గదిలోకి వెళ్లి చూడగా తల్లి కూడా చనిపోయి ఉంది. బాలమణి పడుకున్న చోటే గొంతుకు చీరతో ఉరివేసి చంపినట్లుగా తెలుస్తోంది. భర్తే ఆమెను చంపేసి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.