బిహర్లో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం.. భార్య గర్భంతో ఉందని కూడా చూడకుండా ముక్కలుగా నరికి చంపేసిన అమానవీయ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ ఘటన నలందా జిల్లాలో జరిగింది. నోనియా బిగ్హా గ్రామానికి చెందిన సంజిత్, కాజల్‌కు గతేడాది జూన్ 27న వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నకానుకలు కూడా భారీగానే ఇచ్చారు. ఆ సమయంలో సంజిత్‌కు ఇండియన్ రైల్వేస్‌లో గ్రూప్‌డీ ఉద్యోగం చేస్తుండేవాడు.
తాజాగా, అతనికి టీటీఈ గా ప్రమోషన్ వచ్చింది. దీంతో తమకు అదనపు కట్నం కావాలని అత్తింటివారు కొంతకాలంగా కాజల్‌ను వేధించసాగారు. ఆమెను మానసికంగా, శారీరకంగా తీవ్ర హింసలకు గురిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాజల్ తండ్రి అరవింద్ సింగ్ 80వేల రూపాయలను ఆమె భర్తకు ఇచ్చాడు. అయినప్పటికీ వారి వేధింపులు ఆగలేదు. ఆమెను ప్రతి రోజు తీవ్రంగా కొడుతూ మానసిక వేదనకు గురిచేసేవారు. కాగా, గత వారం ఆమెను గర్భవతి అని కూడా చూడకుండా తీవ్రంగా హింసించారు. అంతటితో ఆగకుండా.. ఆమెను బిగ్హా గ్రామంలోని పోలాల్లోకి లాక్కునిపోయారు. అక్కడ ఆమెను ముక్కులు ముక్కలుగా నరికి చంపేశారు.
అయితే, జులై 17న చివరిసారిగా తన కూతురితో ఫోన్లో మాట్లాడినట్లు మంజు దేవి చెప్పారు. కాగా, ఫోన్లో మాట్లాడుతూ.. నాకు చాలా భయంగా ఉందని మా అమ్మాయి చెప్పిందని కన్నీటి పర్యంత మయ్యింది. కొన్ని రోజులుగా కాజల్ సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సంజిత్ కూడా కజల్ కన్పించడంలేదని చెప్పాడు. దీంతో, యువతి తండ్రి అరవింద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న హిల్సా పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో, నోనియా బిగ్హా గ్రామంలోని పోలాల్లో జులై 20న.. కొన్ని శరీర భాగాలు ముక్కలు, ముక్కలుగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వాటిని కాజల్ శరీర భాగాలుగా అరవింద్ గుర్తించారు. దీంతో, పోలీసులు కజల్ మృతదేహన్ని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, సంజిత్ను, అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న హిల్సా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్లు తెలిపారు.