తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందన్న కక్షతో కట్టుకున్న భార్యను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన భర్త రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. లింగాల మండలం వడ్డె రాయవరం గ్రామానికి చెందిన కాట్రాజు పెద్దమ్మ ఈ నెల 22న అదృశ్యం కాగా సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 25వ తేదీన అడవిలో ఉరివేసుకున్నట్లు చెట్టుకు వేలాడుతున్న పెద్దమ్మ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెను హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భర్తపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.వడ్డె రాయవరం గ్రామానికి కాట్రాజు చిన్న వెంకటయ్యకు పెద్దమ్మ అనే మహిళతో చాలాకాలం క్రితం వివాహమైంది. కొంతకాలంగా వెంకటయ్య మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. తన సంబంధానికి అడ్డుగా ఉన్న భార్యను చంపేయాలనుకున్నాడు. ఈ నెల 22న సాయంత్రం సీతాఫలం కాయలు తీసుకొద్దామని నమ్మబలికి భార్యను ఎద్దుల బండిపై నల్లమల ప్రాంతానికి తీసుకెళ్లాడు.
కొద్దిదూరం వెళ్లాక ఆమె గొంతు నులిపి హత్య చేశాడు.హత్యగా అనుమానం రాకుండా శవానికి ఉరేసి నల్లమల ప్రాంతంలో చెట్టుకు వేలాడదీశాడు. అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ, ఆంజనేయులు అనే మరో వ్యక్తి కూడా ఈ హత్యకు సహకరించారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు చిన్న వెంకటయ్య, ఆంజనేయులు, మహిళను గురువారం అరెస్ట్ చేసి అచ్చంపేట న్యాయస్థానంలో హాజరుపరిచారు.