తన కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందనే తీవ్రంగా కలతచెందిన ఓ వ్యక్తి.. భార్య, మిగతా ఇద్దరు కుమార్తెల ప్రాణాలు తీశాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తమిళనాడులోని నాగపట్టణం జిల్లాల్లో చోటుచేసుకుంది. దళితుడ్ని కుమార్తె పెళ్లి చేసుకుందని ఆవేశంతో రగలిపోయిన అతడు చివరకు మైనర్ బాలిక సహా మిగతా ఇద్దరు కుమార్తెలు, భార్యను చంపేసి, తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నాగపట్టణం ఎస్పీ జవహర్ మాట్లాడుతూ… స్థానికంగా టీ దుకాణం నడిపే లక్ష్మణన్‌కు ముగ్గురు కుమార్తెలు. అతడి పెద్ద కుమార్తె.. ఓ దళిత యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని తెలిపారు. కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడంతో కుటుంబం పరువుపోయిందని భావించాడు. దీంతో మిగతా ఇద్దరు కుమార్తెలు, భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా కలకలం రేగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేపట్టారని తెలిపారు.
తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కులాంతర వివాహాలు చేసుకున్నవారి పట్ల వివక్ష, దాడులు, పరువు హత్యలు వంటి ఇప్పటికీ జరుగుతున్నాయి. 2016లో తిరుప్పూర్ జిల్లా ఉడుమల్‌పేట్‌లో అగ్రవర్ణాలకు చెందిన యువతిని పెళ్లిచేసుకున్న దళిత యువకుడ్ని పట్టపగలే నడిరోడ్డుపై గూండాలు హత్య చేశారు. ఇక, ఇంజినీరింగ్ విద్యార్థి శంకర్ హత్య కేసు తమిళనాడులో సంచలనం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న శంకర్, కౌశల్యపై దుండుగులు దాడికి పాల్పడగా..శంకర్ చనిపోయాడు. కౌశల్య తీవ్ర గాయాలతో బయటపడింది.
ఈ హత్య కేసులో కౌశల్య తండ్రి సహా ఆరుగురికి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, 2020లో కౌశల్య తండ్రిని మద్రాసు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మిగిలిన వారికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఇటీవల అగ్రవర్ణాలకు చెందిన మహిళలను వివాహం చేసుకున్న ఇద్దరు యువకులు రైలు పట్టాలపై శవమై కనిపించిన ఘటనలు తమిళనాడులో వెలుగుచూశాయి.