ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో టైలర్ హత్య చేయబడ్డాడు. ఒడిశా రాష్ట్రం, గజపతిజిల్లాకి చెందిన అప్పలస్వామి(39) పదేళ్ల క్రితం కుటుంబ సభ్యులతో నగరానికి వచ్చాడు. మూసాపేట జనతా నగర్‌లో టైలర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య మూడేళ్ల కిత్రం చనిపోయింది. ముగ్గురు కుమార్తెలు కల్యాణి, శ్రావణి, గౌతమితో కలిసి నివసిస్తున్నాడు. అతని షాప్ లో ఓ మహిళను సహాయకురాలిగా పెట్టుకున్నాడు. ఆమెతో అప్పలస్వామికి వివాహేతర సంబంధం ఉన్నట్టు సదరు మహిళ భర్త సంజీవరావుకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అప్పలస్వామిపై అనుమానం పెంచుకున్న సంజీవరావు తన భార్య, కొడుకుతో కలిసి ఈనెల 19వ తేదీన అతడి ఇంటికి వెళ్లారు. ఇంట్లో లేకపోవడంతో టైలర్‌షాపుకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న అతడిపై ముగ్గురూ కలిసి దాడి చేశారు. పెద్ద ఐరన్ స్కేల్‌తో తీవ్రంగా కొట్టి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు చికిత్స చేయించారు. నొప్పిగా ఉండడంతో ఈనెల 13న స్కానింగ్ తీయించగా బలమైన గాయాలు తగిలినట్టు తేలింది. 14వ తేదీన శ్వాస ఆడకపోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంజీవరావు, అతడి భార్య బుద్ధమ్మ, కుమారుడు హరిబాబును కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.