బాలికలు, మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఓ చోట ఆడవారిపై అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవల జిల్లాలో పది రోజుల వ్యవధిలోనే రెండు అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇందులో సామూహిక అత్యాచారాలు కూడా ఉన్నాయి. కేసుల పెరుగుదల జిల్లా ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది.
జిల్లాలో పోలీసులు రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ప్రభుత్వం మహిళల రక్షణ కోసం షీ టీంలు ఏర్పాటు చేశారు. నిర్భయ లాంటి పలు కఠిన చట్టాలు తెచ్చారు. బాలికల కోసం పోక్సో చట్టం తెచ్చారు. అయినా అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాలో వరుస ఘటనలతో పోలీసుశాఖ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇద్దరు బాలికలపై అత్యాచార ఘటన కలకలం రేగింది. పెయింటర్స్ కాలనీకి చెందిన మహ్మద్ వసీం చాకెట్లు ఆశ చూపి ఇద్దరు బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు పదిరోజుల ముందు బస్టాండ్ వద్ద ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డిగ్రీ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. అలాగే గత బుధవారం ఆర్మూర్‌లో మైనర్ బాలికపై చాక్లెట్లు ఆశ చూపి ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఇటీవల గుండారం, ఎనీ్టఆర్ చౌరస్తా, డిచ్‌పల్లి ప్రాంతాల్లోనూ అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. గుండారంలో ఓ మహిళను అత్యాచారం చేసి హత్యచేశారు. సారంగాపూర్‌లో గత ఏడాది మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నందిపేట మండలంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో తరచుగా జరుగుతున్నాయి. గత ఏడేళ్లుగా 324 ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసు శాఖ ఆందోళనకు గురవుతుంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇద్దరు బాలికలపై అత్యాచార ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సౌత్ మండల సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని ఓ కాలనీలో అద్దె ఇంట్లో ఉండే మహ్మద్ వసీం మేస్త్రీగా పనిచేస్తూ జీవించేవాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజులుగా ఇంటి సమీపంలో ఉండే ఇద్దరు బాలికలకు చాక్లెట్లు ఇవ్వడం మొదలు పెట్టాడు. గత ఆదివారం సాయంత్రం ఇద్దరికి చాక్లెట్లు కొనిచ్చి, వారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికలను బెదిరించాడు.
దీంతో వారు ఎవరికీ చెప్పకుండా ఉండిపోయారు. బాధిత బాలికల్లో ఒకరికి 8 ఏళ్లు, మరో బాలికకు 12 ఏళ్లు ఉంటాయి. అయితే ఓ బాలిక కడుపునొప్పితో బాధపడుతుండడాన్ని గమనించిన తల్లి నిలదీయడంతో విషయాన్ని చెప్పింది. బాలికల కటుంబ సభ్యులు నిందితుడిని నిలదీసి గురువారం ఆరో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పట్టణంలో ఆరేళ్ల చిన్నారిపై అదే కాలనీకి చెందిన ఓ బాలుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. పట్టనంలోని ఓ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని 14 ఏళ్ల బాలుడు చాక్లెట్ ఇస్తానని ఇంటి సందులోకి తీసుకువెళ్ళి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిపారు. చిన్నారి అరవడంతో చుట్టుపక్కల వారు బాలుడిని çపట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.