కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడా? భార్య మెడకు వైరుతో ఉరి బిగించి హత్య చేసి.. ఆపై దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాడా? అంటే అవుననే అంటున్నారు పోలీసులు. పెడన పట్టణంలోని ఐదో వార్డు దాదాగుంట సమీపంలో అక్టోబర్ 26న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వివాహిత నఫిసాబేగం కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తు పోయే వాస్తవాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసును తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు హత్య కేసుగా మార్చారు.
దీనికి సంబంధించి ఎస్ఐ టి. మురళి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నం పరాసుపేటకు చెందిన నఫిసాబేగంను పెడన దాదాగుంటకు చెందిన ఎండీ యూసఫ్‌కు ఇచ్చి ఎనిమిదేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి ఏడేళ్ల బాబు. వివాహామైన నెల రోజుల నుంచి వీరి మధ్య గొడవలు జరగసాగాయి. ఈ క్రమంలో యూసఫ్ మరో యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం నఫిసాబేగంకు తెలియడంతో ఆ గొడవలు పెద్దవయ్యాయి. యూసఫ్ తనకు అప్పులున్నాయని, పుట్టింటి నుంచి నగదు తీసుకురావాలని భార్యను వేధించసాగాడు.
ఈ విషయమై అక్టోబరు 26న ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా.. అకస్మాత్తుగా ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తుకొచ్చిన యూసఫ్ తన భార్య వంటింట్లో ఉరివేసుకుందని కిందకు దించానని చెప్పి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనపై మృతురాలి సోదరుడు మహమ్మద్ గౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూసఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు పోస్టు మార్టం నివేదిక ఆధారంగా విచారించారు. ఈ విచారణలో నఫిసాబేగంది ఆత్మహత్య కాదని తేల్చి.. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.