ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారన్న అనుమానంతో తన 16 ఏళ్ల కూతురుని తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఇంట్లోని అలారం మోగడంతో ఎవరో ఆగంతకులు చొరబడ్డారని ఆమె తండ్రి కాల్పులు జరిపాడు. కాసేపటి తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా తన కూతరు జానే హెయిర్స్టన్ అక్కడ పడిపోయిఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు.
ఈ ఘటనపై బుధవారం ఉదయం 4:30గంటల ప్రాంతంలో ఆమె తల్లి అత్యవసర సేవలకు కాల్చేసి తెలియజేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అత్యవసర బృందం సాయంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ హెయిర్స్టన్ చికిత్స పొందుతూ 5:42 గంటల ప్రాంతంలో మరణించినట్లు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.