భార్యను అమ్మేసిన భర్త

భార్యను అమ్మేసిన భర్త

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి తన భార్యను అమ్మేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. గుణ జిల్లా మృగ్వాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన గోపాల్‌ గుర్జార్‌ అనే వ్యక్తి లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువయ్యింది. చివరకు వారికి భార్యను అమ్మేశాడు. అందుకు బాధితురాలు నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గుర్జార్.. ఆమెను తల్లిదండ్రులతో కలిసి బావిలోకి తోసేశాడు.

అయితే, దీనిని గమనించిన ఓ వ్యక్తి బావిలో దూకి ఆమె ప్రాణాలకు కాపాడాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కులుంబే గ్రామానికి చెందిన బాధిత మహిళకు.. సగోరియాకు చెందిన గోపాల్ గుర్జార్‌తో ఐదేళ్ల వివాహం జరిగింది. అంతా సజావుగా సాగుతుండగా.. కొద్ది రోజుల కిందట గోపాల్ అప్పులు చేశాడు. అవి తీర్చలేకపోవడంతో వారి వద్ద నుంచి మరి కొంత మొత్తాన్ని తీసుకుని భార్యను అప్పగించాడు. ‘మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియిన ముగ్గురు వ్యక్తులు వచ్చి గుర్జార్‌తో మాట్లాడారు.. అనంతరం వారితో వెళ్లాలని భార్యకు చెప్పాడు.. ఒప్పుకోని ఆమె భర్తతో గొడవపడింది’ అని పోలీసులు చెప్పారు.

‘మర్నాడు ఉదయం పొలంలోకి వెళదామని తీసుకెళ్లాడని, అప్పటికే ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.. తన అత్తమామలు కూడా అక్కడకు చేరుకుని వారితో వెళ్లాలని బలవంతం చేశారు. తాను ఒప్పుకోకపోవడంతో పక్క పొలంలో ఉన్న ఓ బావిలో తోసేశారు.. దీనిని గమనించిన ఓ వాచ్‌మెన్, ఆయన భార్య వచ్చి కాపాడారు.. అమ్మేసినవారితో వెళ్లకపోతే చంపుతామని బెదరించారు’ అని పేర్కొంది.

బాధితురాలి తల్లిదండ్రులకు గ్రామస్థులు విషయం తెలియజేయడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలిసి అక్కడకు చేరుకునేటప్పటికి గోపాల్ గుర్జార్ అక్కడ నుంచి పరారయ్యాడు. గోపాల్ గుర్జార్, అతడి తల్లిదండ్రులు రామ్‌దయాల్ గుర్జార్, రామేతి బాయ్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదుచేశారు. దర్యాప్తు కొనసాగుతోందని, గోపాల్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.