పార్కులో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ యువకుడ్ని దారుణంగా కొట్టి అనంతరం నగ్నంగా రోడ్లపై ఊరేగించిన ఘటన కర్ణాటకలోని హసన్లో చోటుచేసుకుంది. హసన్ పట్టణంలోని మహారాజా పార్కులో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని వారి బారి నుంచి యువకుడ్ని రక్షించారు. తమ కస్టడీకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. విజయపుర జిల్లాకు చెందిన బాధితుడు మేఘరాజ్.. హసన్లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం నాడు మహారాజా పార్కుకు వెళ్లిన మేఘరాజ్.. అక్కడ ఓ బాలికను వేధించాడని కొందరు అతడిపై దాడిచేశారు. పోలీసులకు అప్పగించకుండా దారుణంగా కొట్టి, ఒంటిపై దుస్తులను విప్పించారు. అనంతరం రద్దీగా ఉండే హేమావతి సర్కిల్ వద్ద రోడ్డుపై ఊరేగించారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో అక్కడకు చేరుకుని బాధితుడ్ని వారి నుంచి రక్షించారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. మేఘరాజ్పై దాడికి పాల్పడిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ‘‘సంఘటనా స్థలంలో కొంతమంది వ్యక్తులు చేసిన ఆరోపణల ప్రకారం ఓ బాలికను మేఘరాజ్ వేధించాడు.. అయితే, ఆ బాలిక మాత్రం మేఘరాజ్పై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.. అతడ్ని దారుణంగా కొట్టి, నగ్నంగా ఊరేగించడంతో బాధితుడు మాకు ఫిర్యాదు చేశాడు.. నలుగురు వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 341, 323, 504, 506 కింద కేసులు నమోదుచేశాం’’ అని హసన్ పోలీసులు తెలిపారు.