14 మందిని మహిళలను వివాహం చేసుకున్న వ్యక్తి

14 మందిని మహిళలను వివాహం చేసుకున్న వ్యక్తి

ఒకటి రెండు కాదు ఏకంగా 14 మందిని మహిళలను వివాహం చేసుకున్న వ్యక్తిని ఒడిశా పోలీసులు భువనేశ్వర్‌లో అరెస్ట్ చేశారు. బాధిత మహిళల్లో ఏడు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. కేంద్రపరా జిల్లా పాట్కురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి 48 ఏళ్ల వ్యవధిలో 14 మందిని వివాహం చేసుకున్నాడు. నిందితుడికి 1982లో మొదటిసారి వివాహం కాగా.. 20 ఏళ్ల తర్వాత 2002లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు.

అయితే, 2002 నుంచి 2020 మధ్య మ్యారేజ్ బ్యూరోల ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని, ఒకరికి తెలియకుండా ఒకర్ని బుట్టలో వేసుకున్నాడని భువనేశ్వర్ డిప్యూటీ కమిషన్ ఉమాశంకర్ దాస్ అన్నారు. ఢిల్లీలో స్కూల్ టీచర్‌గా పనిచేసే చివరి భార్యతో కలిసి భువనేశ్వర్‌లో ఉంటున్నాడని, ఇటీవలే అతడి నిజస్వరూపం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి అరెస్ట్ చేశామని తెలిపారు. ఆమెను 2018లో వివాహం చేసుకుని, భువనేశ్వర్‌కు తీసుకొచ్చినట్టు గతేడాది జులైలో మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

భర్త నంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉండే మధ్యవయస్కులైన మహిళలను నిందితుడు టార్గెట్ చేసేవాడని తెలిపారు. వారితో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకునేవాడని తర్వాత అందినంత డబ్బుతో ఉడాయించేవాడని వెల్లడించారు. తాను డాకర్ట్‌నని చెప్పుకుంటూ లాయర్లు, ఉన్నత విద్యావంతులు, ఫిజీషియన్లను బుట్టలో వేసుకున్నాడు. బాధిత మహిళల్లో ఒకరు సైనిక దళాల్లో పనిచేయడం గమనార్హం.

ఢిల్లీ, పంజాబ్, అసోం, ఝార్ఖండ్, ఒడిశా సహా ఏడు రాష్ట్రాలకు చెందిన 14 మంది మహిళలు ఇతడి చేతిలో మోసపోయారు. మొదటి ఇద్దరు భార్యలు ఒడిశాకు చెందినవాళ్లే. చివరి భార్య ఫిర్యాదుతో నిందితుడ్ని సోమవారం అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి వద్ద 11 ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువుర్ని మోసం చేయడం, హైదరాబాద్, ఎర్నాకులంలో బ్యాంకుల్లో రుణం ఎగవేత కేసుల్లోనూ గతంలో పోలీసులు రెండుసార్లు అరెస్ట్ చేశారు.