అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి ‘మనసా మనసా’ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.
ఈ సినిమాకు గోపి సుందర్ సంగీత దర్శకుడు. మనసా మనసా పాటకు సాహిత్యం అందించిన వారు సురేంద్ర కృష్ణ. పాడినవారు సూపర్ ఫామ్ లో ఉన్న సిద్ శ్రీరామ్. “మనసా మనసా మనసారా బ్రతిమాలా తన వలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావె మనసా నా మాట అలుసా” అంటూ సింపుల్ పదాలతో ఆకట్టుకునే సాహిత్యం అందించారు సురేంద్ర కృష్ణ. హీరో తన ప్రేయసికి సంబంధించిన ఆలోచనలతో సతమతవుతూ అదోరకమైన తీయని హాయితో పాడుకునే పాట ఇది. ఈమధ్య సిద్ శ్రీరామ్ పాడిన పాటలన్నీ మొదటిసారి వినగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ ఇది మాత్రం ఆ స్థాయిలో అద్భుతం అని చెప్పలేం. వినగా వినగా నచ్చే పాట ఇది.