సినిమా కోసం పెద్ద ప్ర‌ణాళిక‌లు వేసిన మంచు విష్ణు

సినిమా కోసం పెద్ద ప్ర‌ణాళిక‌లు వేసిన మంచు విష్ణు

మంచు విష్ణుకు తెలుగులోనే క‌నీస స్థాయిలోనూ మార్కెట్ లేదిప్పుడు. గ‌త రెండేళ్ల‌లో అత‌డి నుంచి వ‌చ్చిన ఆచారి అమెరికా యాత్ర‌, గాయ‌త్రి, ఓట‌ర్ సినిమాలు రిలీజ్ ఖ‌ర్చులు కూడా వెన‌క్కి తేలేదు. మార్కెట్ పూర్తిగా జీరో అయిపోవ‌డంతో కొంత కాలం గ్యాప్ కూడా తీసుకున్నాడ‌త‌ను. ఈ మంచు హీరో ఇక సినిమాలేమైనా మానేస్తాడా అని సందేహాలు కూడా క‌లిగాయి.

ఐతే ఈ గ్యాప్ త‌ర్వాత విష్ణు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు లైన్లో పెట్టాడు. తెలుగుతో పాటు ఇంగ్లిష్‌లోనూ తెర‌కెక్కుతున్న ద్విభాషా చిత్రంలో అత‌ను న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు మోస‌గాళ్లు అనే టైటిల్ ఖ‌రారు చేసి ఇటీవ‌లే ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేశారు. జెఫ్రీ చిన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

కాజ‌ల్ అగ‌ర్వాల్, న‌వ‌దీప్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమా కోసం మంచు విష్ణు పెద్ద ప్ర‌ణాళిక‌లే వేశాడ‌ట‌. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్రిమియ‌ర్‌గా ప్ర‌ద‌ర్శించేందుకు విష్ణు స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌. ఐతే అక్క‌డ ప్ర‌ద‌ర్శించాలంటే సినిమాకు ఒక రేంజ్ ఉండాలి. ఆషామాషీ చిత్రాల‌కు అవ‌కాశం ద‌క్క‌దు. కానీ త‌మ సినిమాకు ఆ స్థాయి ఉంద‌ని.. ఫిలిం ఫెస్టివ‌ల్ నుంచి అప్రూవ‌ల్ సంపాదిస్తామ‌ని విష్ణు ధీమాగా ఉన్నాడ‌ట‌.

తెలుగులోనే మార్కెట్ జీరో అయిపోయిన హీరో ఇంగ్లిష్ సినిమా చేయ‌డ‌మే జ‌నాల‌కు ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంటే.. కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ క‌బురు ఇంకా విడ్డూరంగా తోస్తోంది. మ‌రి విష్ణు ధీమా ఏంటో చూడాలి. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు.