భారత హాకీలో కరోనా కలకలం రేపుతోంది. జాతీయ స్థాయి ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతూ ఉండటం ఇండియన్ హాకీలో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా ఆరో పాజిటివ్ నమోదు కావడంతో మరోసారి అలజడి రేగింది. హాకీ ఆటగాడు మన్‌దీప్ సింగ్‌కు తాజాగా కరోనా బారిన పడ్డాడు. తాజాగా జరిపిన కోవిడ్-19 టెస్టుల్లో మన్‌దీప్‌కు కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. తద్వారా భారత హాకీలో ఆరో పాజిటివ్ నమోదైంది. ఈ విషయాన్ని సాయ్ ఓ ప్రకటనలో తెలిపింది.ఆగస్టు 20వ తేదీ నుంచి నేషనల్ క్యాంప్ ఆరంభించడానికి సన్నాహకాలు ప్రారంభించిన తరుణంలో వరుసగా క్రీడాకారులు కరోనా బారిన పడటం గుబులు పుట్టిస్తోంది.
దాంతో జాతీయ క్యాంపును వాయిదా వేసే పరిస్థితిపై భారత హాకీ సమాఖ్య చర్చలు జరుపుతోంది. గతవారం భారత హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో నలుగురు కోవిడ్ బారిన పడ్డారు. సుదీర్ఘ విరామం తర్వాత సాయ్ సెంటర్‌కు వెళ్లిన క్రమంలో వీరికి కరోనా సోకింది. సాయ్ సెంటర్‌కు 20 మంది ఆటగాళ్లు హాజరు కాగా అందులో ఆరుగురికి కరోనా సోకడంతో కలవరం మొదలైంది. కరోనా సోకిన హాకీ ఆటగాళ్లలో మన్‌దీప్, మన్‌ప్రీత్ సింగ్‌లతో పాటు సురేంద్ర కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్, కృష్ణ బహుదుర్ పాఠక్‌లు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు సాయ్ వెల్లడించింది.