రాజీనామా తర్వాత బాబుపై కామినేని, మాణిక్యాల‌రావు కామెంట్స్

Manikyala Rao and Kamineni Srinivasa Rao Praises chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కేంద్రప్ర‌భుత్వం నుంచి టీడ‌పీ వైదొలిగిన కొన్ని గంట‌ల‌కే రాష్ట్ర ప్ర‌భుత్వంలోని బీజేపీ మంత్రులు రాజీనామాలు స‌మ‌ర్పించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గం నుంచి వైదొలుగుతున్న‌ట్టు బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస‌రావు, మాణిక్యాల‌రావు ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో సీఎం చంద్ర‌బాబును క‌లిసిన వారిద్ద‌రూ రాజీనామా లేఖ‌లు అంద‌జేశారు. నాలుగేళ్ల కాలంలో స‌మ‌ర్థంగా ప‌నిచేశార‌ని ముఖ్య‌మంత్రి వారిని అభినందించారు. సాధార‌ణంగా ప్ర‌భుత్వం నుంచి వైదొలిగేట‌ప్పుడు భాగ‌స్వామ్య‌ప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుంటాయి. కానీ బీజేపీ మంత్రుల రాజీనామా సంద‌ర్భంగా అందుకు భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపించింది. రాజీనామా చేసిన మంత్రులిద్ద‌రూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపైనా, ఆయ‌న ప‌నితీరుపైనా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డం విశేషం. చంద్ర‌బాబుకు రాజీనామా లేఖ స‌మ‌ర్పించిన అనంత‌రం కామినేని అసెంబ్లీలో మాట్లాడుతూ ఉద్వేగానికి లోన‌య్యారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం చంద్ర‌బాబు క‌ష్ట‌ప‌డినంత‌గా ఎవ‌రూ క‌ష్ట‌ప‌డ‌లేద‌ని, చంద్ర‌బాబు నాంటి నేత రాష్ట్రానికి అవ‌స‌ర‌మ‌ని, రాష్ట్రాన్ని ఉన్న‌త‌ప‌థంలోకి తీసుకెళ్లడానికి ఆయ‌న నిరంత‌రం శ్ర‌మిస్తున్నార‌ని కామినేని కొనియాడారు. తాను ఆజాత శ‌త్రువున‌ని, ఆరోగ్య‌శాఖ మంత్రిగా ప‌నిచేసిన కాలంలో, అందరితోనూ తాను స్నేహంగానే మెలిగాన‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు త‌న‌కు ఎంతో స‌హ‌కారం అందించార‌ని తెలిపారు. త‌న‌కు మంత్రిప‌ద‌వి రావ‌డానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడే కార‌ణ‌మ‌ని చెప్పారు. కామినేని రాజీనామా లేఖ‌లో ప్ర‌స్తావించిన అంశాలు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. కేంద్రంలో, రాష్ట్రంలో మంచి ప్ర‌భుత్వాలు ఉన్న‌ప్ప‌టికీ… ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌రంగా ఉంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ఏపీకి జ‌రిగిన అన్యాయంపై తెలుగువారంతా ఆవేద‌న‌తో ఉన్నార‌ని, అయినప్ప‌టికీ పార్టీ ఆదేశాల మేర‌కు మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని లేఖ‌లో వివ‌రించారు.

మ‌రో మంత్రి మాణిక్యాల‌రావు సైతం ఇదే ర‌క‌మైన అభిప్రాయాన్ని వ్య‌క్తంచేశారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే తాను రాజీనామా చేయాల్సివ‌చ్చింద‌ని చెప్పారు. ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌క‌ముందే. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంపై చంద్ర‌బాబు ఒత్తిడి తెచ్చార‌ని, ముంపు మండ‌లాల‌ను ఏపీలో క‌ల‌ప‌డంలో ఆయ‌న స‌ఫ‌లీకృతం అయ్యార‌ని, చంద్ర‌బాబు స‌మ‌ర్థ‌త‌కు పోటీలేద‌ని మాణిక్యాల‌రావు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. త‌న‌కు మంత్రిప‌ద‌వి రావ‌డానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడే కార‌ణ‌మన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా త‌న శాఖ‌లో మార్పులు తీసుకొచ్చేందుకు ప‌నిచేశాన‌న్నారు. త‌న‌కు స‌హ‌క‌రించిన ముఖ్య‌మంత్రికి, మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. రాజీనామాల‌కు ముందు, త‌ర్వాత కూడా కామినేని, మాణిక్యాల‌రావు టీడీపీ మంత్రుల‌తో స్నేహ‌పూర్వ‌కంగానే మెలిగారు. చంద్ర‌బాబును క‌లిసి రాజీనామాలు స‌మ‌ర్పించే ముందు… బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష కార్యాల‌యంలో కామినేని, మాణిక్యాల‌రావు కూర్చుని ఉండ‌గా… టీడీపీ మంత్రులు వారిని క‌లిశారు. ప‌ద‌వుల నుంచి త‌ప్పుకుంటున్నందుకు బాధ‌గా ఉందా అని ప్ర‌శ్నించ‌గా… రాజ‌కీయాల్లో ప్ర‌వేశంతో పాటు నిష్క్ర‌మ‌ణం కూడా గౌర‌వంగా ఉండాల‌ని, ప‌ద‌వి నుంచి సంతోషంగా వైదొలుగుతున్నామ‌ని బీజేపీ మంత్రులు బ‌దులిచ్చారు.