మెలోడి బ్రహ్మగా పేరుగాంచిన సంగీత దర్శకుడు మణిశర్మ ఒకప్పుడు టాలీవుడ్‌ను తన ట్యూన్లతో ఏలారు. పెద్ద హీరోల సినిమా అంటే కచ్చితంగా మణిశర్మ సంగీతం ఉండాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబులకైతే మణిశర్మ అందించిన మ్యూజికల్ హిట్స్ చాలానే ఉన్నాయి. రికార్డులు తిరగరాసిని ఎన్నో సినిమాలకు మణిశర్మ సంగీతం అందించారు. అయితే, ఈ మధ్య కాలంలో మణిశర్మ బాగా వెనకబడిపోయారు.
దేవీ శ్రీ ప్రసాద్, తమన్ లాంటి యువ సంగీత దర్శకులు అడుగుపెట్టిన తరవాత మణిశర్మ హవా బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా దేవీ శ్రీ ప్రసాద్ ప్రభావం ఎక్కువగా పడింది. ఈయనతో పాటు ఎస్.ఎస్.తమన్, అనిరుధ్, మిక్కీ జే మేయర్, అనూప్ రూబెన్స్ వంటి సంగీత దర్శకులు స్టార్ హీరోలతో పనిచేయడంతో మణిశర్మ వెనకబడిపోయారు. మణిశర్మ హవా అయితే తగ్గింది కానీ, సినిమాలు మాత్రం తగ్గలేదు. 2017లో తొమ్మిది సినిమాలకు సంగీతం అందించారాయన. కిందటేడాది కూడా మూడు సినిమాలకు పనిచేశారు. రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
కిందటేడాది ‘దేవదాస్’ లాంటి పెద్ద సినిమాకు మణిశర్మ సంగీతం అందించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కానీ, ఈ ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో మణిశర్మ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. మంచి ఫాస్ట్ బీట్లతో పాటు మెలోడీలను అందించారు. ఈ సినిమాతో మణిశర్మ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. దీంతో పెద్ద హీరోల నుంచి ఆయనకు మళ్లీ పిలుపులొస్తున్నాయి.