మీరెందుకు నా బాట‌లో న‌డుస్తున్నారు…? ప‌్ర‌ధానికి సూటి ప్ర‌శ్న‌

Manmohan Singh comments on Narendra Modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప‌దేళ్లు ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలోగానీ, ఆ త‌ర్వాత గానీ, అంత‌కుముందుగానీ మ‌న్మోహ‌న్ సింగ్ గ‌ల‌గ‌లా మాట్లాడుతుండ‌గా చూసిన‌వాళ్లు ఎవ్వ‌రూలేరు. కాంగ్రెస్ అంత‌ర్గ‌త స‌మావేశాల్లోగానీ, ప‌రిపాల‌న‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల్లో గానీ, మీడియా వ‌ద్ద‌గానీ… ఆయ‌న ఎప్పుడూ ఇత‌ర రాజకీయ నేత‌ల్లా అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌లేదు. ఎక్క‌వ మాట్లాడ‌డం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే… మాట్లాడాల్సినంత కూడా ఆయ‌న మాట్లాడేవారుకాద‌న్న‌ది అంద‌రూ ఆయ‌న‌పై చేసే విమ‌ర్శ‌. దీనివ‌ల్లే అప్ప‌ట్లో ఆయ‌న్ను అంద‌రూ మౌన‌ముని అంటుండేవారు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులైన మోడీ లాంటివార‌యితే మౌన్ మోహ‌న్ సింగ్ అని సెటైర్లు వేసేవారు. అయినా మ‌న్మోహ‌న్ స్పందించేవారు కాదు… కానీ అలాంటి మౌన‌ముని కూడా దేశాన్ని కుదిపేస్తున్న అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై పెద‌వి విప్పారు.

ఒక‌ప్పుడు త‌న‌ను మౌన్ మోహ‌న్ సింగ్ గా అభివ‌ర్ణించిన న‌రేంద్ర‌మోడీ… ఇప్పుడు త‌న పంథాలో న‌డుస్తుండ‌డంపై మౌనం వీడి నిల‌దీశారు. మాట్లాడ‌డం నేర్చుకోవాల‌ని త‌న‌కు స‌ల‌హా ఇచ్చిన మోడీ ఇప్పుడు అదే మౌన‌సూత్రాన్ని పాటిస్తున్నార‌ని మ‌న్మోహ‌న్ సింగ్ ఎద్దేవా చేశారు. అప్పుడు తన‌కిచ్చిన స‌ల‌హానే ఇప్పుడు మోడీ పాటించాల‌ని సూచించారు. దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న అంశాల‌పై మీరెందుకు మౌనం వ‌హిస్తున్నారు అని మ‌న్మోహ‌న్ మోడీని సూటిగా ప్ర‌శ్నించారు. అత్యాచారా ఘ‌ట‌న‌ల‌పై నోరు విప్ప‌రేం? నాకు మాట్లాడాల‌ని హిత‌బోధ చేసి మీరు మౌనం పాటిస్తున్నారా…? ఇప్పుడు దేశంలో జ‌ర‌గుతున్న అత్యాచారాల‌పై నేనే నోరువిప్పి మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నాను.

మీరింత‌వ‌ర‌కూ వాటిపై మాట్లాడ‌క‌పోవ‌డం నాకు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. మీరు ఒక ప్ర‌ధాని హోదాలో ఉన్న విష‌యం మ‌ర్చిపోయిన‌ట్టున్నారు. మీ ప్ర‌భుత్వం కూడా మీదారిలోనే న‌డుస్తున్న‌ట్టుంది. మీకు త్వ‌ర‌లోనే జ్ఞానోద‌యం కావాలని కోరుకుంటున్నాను… అంటూ మాజీ ప్ర‌ధాని… ప్ర‌స్తుత ప్ర‌ధాని వైఖ‌రిని తూర్పార‌బ‌ట్టారు. బ్యాంకింగ్ మోసాలు, మైనారిటీ, ద‌ళితుల‌పై జ‌రుగుతున్న అరాచ‌కాల‌పై నోరు మెద‌ప‌రెందుక‌ని, మ‌హిళ‌ల‌పై, పిల్ల‌ల‌పై జ‌రుగుతున్న అరాచ‌కాల‌కు మీరిచ్చే స‌మాధాన‌మేంట‌ని ప్ర‌ధానిని సూటిగా ప్ర‌శ్నించిన మ‌న్మోహ‌న్ సింగ్ దీనిపై త్వ‌ర‌గా స్పందించ‌క‌పోతే ప్ర‌జాగ్రహానికి బ‌లికాక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. దేశంలోని ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై మౌనం వీడ‌డ‌మే కాకుండా… ప్ర‌ధాని హోదాలో మోడీ త‌న మాట‌తీరు మార్చుకోవాల‌ని కూడా మ‌న్మోహ‌న్ సూచించారు.