క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగక ముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాష్ట్ర మంత్రిగా మారిన టీమిండియా మాజీ ఆటగాడు మనోజ్ తివారి క్రమం తప్పకుండా క్రికెట్‌ను ఫాలో అవుతూ, దానికి సంబంధించిన అప్డేట్స్తో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తాజాగా ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌కు ముందు మనోజ్ తివారి ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
ఇంకా అందుబాటులోనే ఉన్నా అంటూ ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ జట్లను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. మనోజ్ ట్వీట్‌ను బట్టి చూస్తే.. మీతో కాకపోతే చెప్పండి.. ఇప్పుడు రమ్మన్నా వస్తా..! అంటూ సదరు ఫ్రాంచైజీలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, మంత్రి గారు ఐపీఎల్ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అతనిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.
తివారి 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున శివ్పూర్ ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు. ఆల్‌రౌండర్ ఆయిన తివారి 2008-15 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 302 పరుగులు, 5 వికెట్లు సాధించాడు. వన్డేల్లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. తివారి ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 98 మ్యాచ్‌ల్లో 1695 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఎస్ఆర్హెచ్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. కేఎల్ రాహుల్ , దీపక్ హుడా అర్ధ శతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఛేదనలో ఆవేశ్ ఖాన్ , జేసన్ హెల్డర్ , కృనాల్ పాండ్యా (2/27) ధాటికి ఎస్ఆర్హెచ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాహుల్ త్రిపాఠి 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.