కర్నూలు జిల్లా టీడీపీ ప్రచారంలో వైసీపీ అడ్డంకులు…కాల్పుల్లో గాయపడ్డ టీడీపీ క్యాండిడేట్ !

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఉద్రిక్తతంగా మారింది. ఖగ్గల్‌లో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి గాయపడ్డాడు. ఆయనతో పాటు ASI వేణుగోపాల్ కాలుకు గాయమైంది. కాల్పుల వల్లే ఈ పరిస్థితి అని తెలుస్తోంది. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైసీపీ నేతలు దాడి చేశారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వగ్రామం ఖగ్గల్‌లో మార్చి 16వ తేదీ శనివారం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ప్రచారం నిర్వహించేందుకు వెళ్లారు. టీడీపీ జెండా దిమ్మెను ఆవిష్కరించారు. ప్రచారం చేయొద్దని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ప్రదీప్ రెడ్డి, ఇతరులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడైనా ప్రచారం నిర్వహించుకునే హక్కు ఉందని, అడ్డుకోవద్దని తిక్కారెడ్డి అడ్డం తగిలారు. దీనికి వైసీపీ నేతలు ససేమిరా అన్నారు. దీంతో రెండు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. తోపులాట జరిగింది. టీడీపీ జెండా దిమ్మెను కూల్చి వేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో తిక్కారెడ్డికి చెందిన గన్ మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత తిక్కారెడ్డి కాలికి గాయం అయి ఆయన కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో ఏఎస్ఐ వేణుగోపాల్ కాలికి గాయమైంది. ప్రదీప్ రెడ్డి కాల్పులు జరపడంతోనే తిక్కారెడ్డి గాయపడ్డారని టీడీపీ నేతలు అంటున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. రక్తస్రావం అధికం కావడంతో ఆయనని హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తున్నారు.