మహమ్మారి కరోనా ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. అంతకంతకూ విస్తరిస్తూ ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రాణాంతక వైరస్ సోకుతుందనే భయం వెంటాడటంతో కరోనా మృతులు సరైన పద్ధతిలో అంత్యక్రియలకు కూడా నోచుకోలేకపోతున్నారు. మంచిర్యాలలో ఒకే కుటుంబంలో ముగ్గురు కోవిడ్-19కు బలైపోగా.. కామారెడ్డిలో ఓ వృద్ధురాలు కరోనాతో మృతిచెందగా.. ఎవరూ ఆమె దగ్గరికి వెళ్లకపోవడంతో వైరస్ బారిన కుటుంబ సభ్యులే అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. వివరాలు.. మంచిర్యాలలో ప్రముఖ వ్యాపారి కుటుంబంపై మహమ్మారి పగబట్టింది. 20 రోజుల వ్యవధిలోనే తండ్రి- ఇద్దరు కొడుకుల ప్రాణాలను బలిగొంది. కరోనాతో ముగ్గురూ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు అంతులేని విషాదంలో మునిగిపోయారు.
కామారెడ్డి పట్టణం గోపాలస్వామి గుడిరోడ్డులో ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో ఇంట్లోని 80 ఏళ్ల వృద్దురాలు మృతి చెందగా.. వైద్య శాఖతో పాటు మున్సిపల్, రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చినా వారి నుంచి స్పందన కరువైంది. స్థానికులు, అధికారులతో తమ గోడు వెళ్లబోసుకున్నా ఒక్కరూ కనికరించలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కరోనా బాధితులైన మృతురాలి మనవళ్లు స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి, తమ దుస్థితిని వివరించి మూడు పీపీఈ కిట్లు తెచ్చుకున్నారు. కిరాయికి ఆటోను మాట్లాడి మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.