జైలు పాలైన కీచక ఎస్సై

జైలు పాలైన కీచక ఎస్సై

సాటి మహిళా ట్రైనీ ఎస్సైపైనే కన్నేసి నీచానికి పాల్పడిన కీచక ఎస్సై కటకటాల పాలయ్యాడు. ట్రైనీ మహిళా ఎస్సైపై అత్యాచార యత్నం చేసిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్సై శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కి పంపించారు. ఎస్సైపై లైంగిక వేధింపుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ట్రైనింగ్‌లో ఉన్న ఎస్సైని డ్యూటీ పేరుతో అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది.

మహిళల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసు అధికారి రేప్ చేసేందుకు యత్నించడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అతన్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రాథమిక విచారణలో అతనిపై ఆరోపణలు నిజమేనని తేలడంతో వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, అత్యాచార యత్నం కేసులు నమోదు చేసి జైలుకి పంపించారు. ఈ రోజు ఉదయం నిందితుడు శ్రీనివాసరెడ్డిని జడ్జి ముందు హాజరుపరిచడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. కేసు విచారణ బాధ్యతలను తొర్రూర్ డీఎస్పీకి అప్పగించారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. చట్టాలనికి ఎవరూ అతీతులు కారని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు.