మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన పేరు మీదుగా డిజిటల్ కరెన్సీ తెచ్చే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మెటాలో అంతర్గత పనులు వేగంగా జరుగుతున్నాయంటూ ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ కామర్స్ రంగం పుంజుకుంటోంది. ఇదే సమయంలో గేమింగ్ రంగం కూడా వేగంగా విస్తరిస్తోంది.
మెటావర్స్ కనుక విస్త్రృత స్థాయిలో అందుబాటులోకి వస్తే గేమింగ్ ప్రపంచం రూపు రేఖలే మారిపోతాయని నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ కరెన్సీని అభివృద్ధి చేయాలని మెటా నిర్ణయించినట్టు సమాచారం.మెటా అభివృద్ధి చేస్తున్న డిజిటల్ కరెన్సీ ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఈ డిజిటల్ కరెన్సీని జుక్బక్స్గా పిలుస్తున్నట్టు సమాచారం. ఈ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే ముందుగా గేమింగ్ ఇండస్ట్రీలో లావాదేవీలకు ఉపయోగించాలని మెటా యోచిస్తోంది. పిల్లలో ఎంతో పాపులరైన రోబ్లోక్స్ గేమ్‌లో రోబక్స్ అనే డిజిటల్ కరెన్సీ ఇప్పటికే చలామనీలో ఉంది. జుక్బక్స్ కూడా ముందుగా గేమింగ్‌లో ప్రయోగించి, అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ కామర్స్‌లో ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి.
గతంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీ తెచ్చేందుకు మెటా ప్రయత్నించింది. ముందుగా లిబ్రా పేరుతో తెస్తారని ప్రచారం జరిగినా చివరకు డైమ్గా పేరు ఖరారు అయ్యింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు క్రిప్టో లావాదేవీలపై నిషేధం లేదా కఠినమైన ఆంక్షలు విధించడంతో క్రిప్టో కరెన్సీ ఆలోచన నుంచి మెటా యూ టర్న్ తీసుకుంది. దాని స్థానంలో జుక్బక్స్ పేరుతో డిజిటల్ కరెన్సీ ప్రాజెక్టును పట్టాలపైకి ఎక్కించింది.