హైదరాబాద్ అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద నిలుచున్న ఓ మహిళపై స్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడి పడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం సాయంత్రం సిటీలో భారీ వర్షం కురుస్తున్నందున అమీర్పేట వైపు వెళ్తున్న మౌనిక మెట్రో స్టేషన్ కింద నిలబడింది. అయితే ఊహించని రీతిలో పైనుంచి పెచ్చులు ఊడి ఆమె తలపై పడ్డాయి. దీంతో ఆమెకు తలకు తీవ్ర గాయాలైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే సమీపంలోని హాస్పిటల్కు తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.
మెట్రో పిల్లర్ కారణంగా దుర్మరణం పాలైన మౌనిక కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలని, దీనికి కారణమైన ఎల్ అండ్ టీపై మర్డర్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. నిన్న అమీర్పేట మెట్రో స్టేషన్లో కాంక్రీట్ పడి చనిపోయిన మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి ఎవరూ సందర్శించి ఓదార్చకపోవడం బాధాకరమన్నారు.
ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించిన తీరును తీవ్రంగా ఖండించారు. ‘నాణ్యత లోపం వల్ల ఈ సంఘటన జరిగింది. మెట్రో స్టేషన్ నిర్మించి రెండేళ్లు కాకుండానే ఇలా జరిగింది. ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని నగరవాసులు ఆందోళనలో ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టత ఇవ్వాలి. మెట్రో రైల్ని ప్రధాని మోదీ ప్రారంభించిన రెండేళ్లలోనే ఇలా జరిగింది. దీనిపై విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి. గతంలో పెచ్చులు ఊడిపోయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కనుకే నిన్న ఒక అమ్మాయి చనిపోయింది. ప్రభుత్వం వెంటనే మౌనిక కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి’ అని శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు.