పెద్ద చదువులు చదివినా ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదం నింపింది. స్థానిక శాంతినగర్ కాలనీకి చెందిన శ్రీలత కు సంతోష్ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంతోష్ స్థానికంగా ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. శ్రీలత ఎమ్మెస్సీ, బీఎడ్ పూర్తిచేసింది. ఈ క్రమంలోనే మంచి కొలువు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని బ్యాంకింగ్, గురుకులాల్లో ఎన్నోసార్లు పోటీ పరీక్షలు రాసింది.
అయితే ఒక్క దాంట్లోనూ ఆమె సెలక్ట్ కాలేకపోయింది. కొద్దిరోజులు డిప్రెషన్లో ఉంటూ కుటుంబసభ్యులతోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. శ్రీలత తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.