పుట్టింటికి పంపలేదని భర్తపై అలిగిన ఓ వివాహిత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని వజ్జవారిపాళెంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని వజ్జవారిపాళెం గ్రామానికి చెందిన కొమ్మల సాగర్‌కు, మాధురికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు.రెండురోజుల క్రితం మాధురి తన పుట్టింటికి పంపాలని భర్త సాగర్‌ను కోరింది.
అయితే ప్రస్తుతం వద్దని అతను అడ్డు చెప్పడంతో వారిద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈక్రమంలో సోమవారం ఆమె ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. చుట్టపక్కల వారు గమనించి ఆమె భర్తకు సమాచారం ఇవ్వగా ఆయన పోలీసులకు విషయాన్ని తెలియజేశాడు. దీంతో ఎస్సై శేఖర్‌బాబు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేటకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.