మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. ఓ చిన్నారిని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మండలం రాజా బొల్లారం గ్రామంలో చోటుచేసుకుంది. బ్రాహ్మణపల్లి భిక్షపతి, మమత దంపతులు. వీరికి ముగ్గురు సంతానం.ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో భర్త వేదింపులు అధికమవడంతో తీవ్ర మనస్థాపం చెందిన మహిళ బుధవారం ఉదయం తన ముగ్గురు పిల్లలతో కలిసి గ్రామ శివారులోని చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో మమతతో పాటు పాప, చిన్న బాబు మృతి చెందగా.. పెద్ద కొడుకును స్థానికులు రక్షించారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను చెరువులోంచి బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.