ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఓ వివాహిత పుట్టింటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరురూరల్ పరిధిలోని పెద్దచెరుకూరులో గురువారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు స్థానికుడైన పులి దేవదానం కెనరా బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి రెండో కుమార్తె సురేడ్డి కీర్తనకు రాజా అనే వ్యక్తితో వివాహమైంది. రాజా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండేవాడు. వీరికి కుమారుడు శ్రీఫల్, కుమార్తె శ్రీషా ఉన్నారు. వీరు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు.
బుధవారం కీర్తన హైదరాబాద్ నుంచి పెద్దచెరుకూరులోని తండ్రి వద్దకు చేరుకుంది. గురువారం ఉదయం కీర్తన ఇంటి మిద్దెపైన ఉన్న బెడ్‌రూంకు వెళ్లింది. కుటుంబసభ్యులు గది వద్దకు వెళ్లి కీర్తనను పిలవగా ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించారు. వెంటనే కీర్తనను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే కీర్తన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని విచారించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.