ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలు సంతోషంగానే జీవించారు. కానీ మొదటి పెళ్లి రోజు కూడా చేసుకోకముందే వరకట్నం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ సంఘటన హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన వంగ మౌనిక(20), వంగ నాగరాజు గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
కాగా వరకట్న వేధింపులు భరించలేక మౌనిక శనివారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. దీంతో మౌనిక తల్లి సుజాత ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు.