ఇష్టంలేని పెళ్లి చేశారనే బాధతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. టౌన్ ఎస్సై ఎం.రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన చుక్క సారమ్మ కుమార్తె రమ్య (20)ని, ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం నెమలిపురి గ్రామానికి చెందిన చీమల వెంకన్నకు ఇచ్చి ఐదు నెలల క్రితం వివాహం జరిపించారు. చుక్క సారమ్మ భర్త ఏడాది క్రితం కరోనాతో మృతిచెందగా కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆమె కుమార్తెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది.
ఆ సమయంలో రమ్య తనకు వివాహం వద్దని చెప్పినప్పటికీ వివాహం జరిపించడంతో ఊరుకుండిపోయింది. ఆషాఢమాసం వచ్చిందని తల్లిగారింటికి వచ్చిన ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది. అనంతరం ఇంటికి వెళ్లాక ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందింది. కొంత సమయానికి తల్లి వచ్చి చూసే సరికి ఆమె మృతిచెందగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై ఎం.రమాదేవి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.