భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కూడేరుకు చెందిన సుగాలి లక్ష్మన్ననాయక్ కుమార్తె సుజాత(27)కు రాయదుర్గం మండలం ఆవులదట్లకు చెందిన పృథ్వీరాజ్ నాయక్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఏడాది కిందట అత్తింటి వారు డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో సుజాత పుట్టింటింటికి వచ్చింది.
పలుమార్లు పెద్దమనుషుల ద్వారా పంచాయితీ జరిగినప్పటికీ ఆమెను భర్త కాపురానికి పిలుచుకోలేదు. దీంతో సుజాత, కొడుకుతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. ఇటీవల భర్త రెండవ వివాహం చేసుకున్నాడన్న సమాచారం తెలియడంతో మనస్తాపం చెందిన సుజాత శనివారం రాత్రి పొద్దుపోయాక పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి సోదరుడు శంకరనాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.