భర్త చేసిన అప్పులకు భార్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి పోలీసులు అవమానించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. నెలమంగల పట్టణంలో నివసిస్తున్న అఖిల భర్త మధుకుమార్ స్థానిక నివాసి చందన్ వద్ద రూ.1లక్ష అప్పు తీసుకున్నాడు. ఎన్నాళ్లయినా చెల్లించకపోవడంతో చందన్ తరచూ ఇంటి వద్దకు వచ్చి అఖిలను అవమానపరిచేలా మాట్లాడేవాడు. దీనికి తోడు శుక్రవారం పోలీసులను ఉసిగొల్పి స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించాడు. ఈ వేదనలు భరించలేక ఆమె డెత్ నోట్ వ్రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భూవివాదం నేపథ్యంలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన రామనగర తాలూకాలో చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న గంటప్ప హత్యకు గురయ్యాడు. బానందూరు గ్రామానికి చెందిన గంటప్ప భైరవనదొడ్డి గ్రామం వద్ద బైక్ సర్వీస్ స్టేషన్ నడుపుతున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దుండగులు గుంపుగా వచ్చి గంటప్పను మారణాయుధాలతో హత్య చేసి పరాయ్యారు. భూ వివాదం కారణంగానే హత్య జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో ఉంది.