పశ్చిమ ఘనాలో భారీ పేలుడు

పశ్చిమ ఘనాలో భారీ పేలుడు

పశ్చిమ ఘనాలో భారీ పేలుడు సంభవించింది. బోగోసో ప్రాంతం సమీపంలో ట్రక్​, మోటర్​ బైక్​ను ఢీకొని పేలుడు చోటుచేసుకుంది. అధికారుల ప్రకారం.. మైనింగ్​ కంపెనీకి పేలుడు పదార్థాలు తరలిస్తున్న ట్రక్​ ప్రమాదానికి గురైంది. పేలుడు సంభవించిన ప్రదేశంలో ఎలక్ట్రిక్​ ట్రాన్స్​ఫార్మర్​ ఉండటం వలన ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో దట్టమైన నల్లని మేఘాలు అలుముకున్నాయి.పేలుడు బీభత్సానికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. ఆ ప్రదేశంలో ఇప్పటి వరకు.. 17 మంది మృతి చెందగా, మరో 59 మంది తీవ్రగాయాలపాలయ్యారు. క్షత గాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

అధికారులు సంఘటన స్థలానికి సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంపై ఘనా అధ్యక్షుడు నానా అక్రూఫో అడ్డో స్పందించారు.ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డ 59 మందిలో.. 42 మందిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.