Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : నాని , సాయి పల్లవి , భూమిక , రాజీవ్ కనకాల
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం : వేణు శ్రీరామ్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్
మూడేళ్ళ కిందట నాని సినిమా మార్కెట్ 3 కోట్లకి కాస్త అటుఇటు గా వుంది. మూడేళ్ళలో ఆ రేంజ్ 30 కోట్లకి కాస్త అటుఇటుగా ఉంటోంది. కుటుంబ నేపధ్యం వున్న హీరోలే ఫీల్డ్ లో నిలదొక్కుకోడానికి, వరసబెట్టి సినిమాలు చేయడానికి ఇబ్బంది పడుతుంటే నాని మాత్రం నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. హిట్ లు మీద హిట్లు కొడుతున్నాడు.సినిమా సెలక్షన్ విషయంలో నాని టాలెంట్ అతని ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. ఈ దశలో నాని చేసిన మరో సినిమా MCA మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా వుందో చూద్దామా…
కథ…
తల్లితండ్రి చిన్నప్పుడే పోతే నానికి (నాని) అన్నయ్య ( రాజీవ్ కనకాల ) తానే అన్నీ అయ్యాడు. దీంతో ఆ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. అయితే అన్నయ్య ఉద్యోగంలో చేరినా నానికి బాధ్యత పెద్దగా పట్టదు. ఆ సమయంలో నాని అన్నయ్యకు పెళ్లి అవుతుంది. వదిన ( భూమిక ) రాకతో నాని జీవితంలో పెద్ద మార్పులే వస్తాయి. వదిన రాకతో అన్న తో తన బంధం విషయంలో ఇన్ సెక్యూరిటీ ఫీల్ అవుతున్న నానికి ఆమె దగ్గరే ఉండాల్సి వస్తుంది. అన్నయ్య కు ఢిల్లీ ట్రాన్స్ ఫర్, వదినకు వరంగల్ లో జాబ్ వల్ల నాని ఆమెకి తోడుగా ఉండాల్సిన పరిస్థితుల్లో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. నానికి వదిన మంచితనం తెలిసే సరికి ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అది ఎవరి వల్ల, ఎందుకు ? ఆ కష్టం నుంచి వడినని నాని ఎలా కాపాడుకున్నాడు అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ…
ఓ మై ఫ్రెండ్ అనే ఓ యావరేజ్ సినిమా తీసిన ఐదేళ్లకు దర్శకుడు శ్రీరామ్ వేణు మంచి ఫామ్ లో వున్న నానికి మిడిల్ క్లాస్ అబ్బాయి కథ చెప్పి ఒప్పించాడు. నాని సక్సెస్ లోను సింహభాగం సినిమాలు మిడిల్ క్లాస్ అబ్బాయి క్యారెక్టర్ వేసినవే. దీంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువ అయ్యాయి. పైగా మధ్యతరగతి వాళ్ళు ఒకప్పుడు బాగా వదిన, మరిది అనుబంధంతో వచ్చిన సినిమాలు చూసారు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో వదిన, మరిది బంధాన్ని ప్రాజెక్ట్ చేసినా అదే కేంద్రంగా సినిమా రావడం ఇదే. నాని, భూమిక ఈ పాత్రల్లో చాలా బాగా చేశారు. అయితే సినిమాకు ఆయువుపట్టుగా ఉండాల్సిన వారి మధ్య బంధాన్ని చూపించడంలో దర్శకుడు అంతగా దృష్టి పెట్టలేదు. ఇక నాని వదిన మంచితనం తెలుసుకునే సీన్ కూడా ఫ్లాట్ గా వుంది. ఈ ఇద్దరి మధ్య బంధం కన్నా నాని లవ్ ట్రాక్ సినిమాలో డామినేట్ చేసింది.
నానికి తగ్గట్టు సాయి పల్లవి కూడా విరగదీయడంతో ఫస్ట్ హాఫ్ లో వినోదానికి కొదవ లేకుండా పోయింది. ఇక హీరోకి వున్న ఫోటోగ్రాఫిక్ మెమరీ, విలన్ ఇంట్రడక్షన్, బిల్డ్ అప్ కూడా బాగా కుదరడంతో సెకండ్ హాఫ్ లో మంచి ఇంటెలిజెంట్ గేమ్ ఉంటుందని ఆశిస్తాం. అక్కడే దర్శకుడు విఫలం అయ్యాడు. సెకండ్ హాఫ్ లో వినోదం, ఇంటలిజెన్స్ రెండు మిస్ అయ్యాయి. దర్శకుడు ఆ కోణంలో రాసుకున్న కొన్ని సీన్స్ కూడా ఎక్కడో చూసినట్టు అనిపిస్తాయి. దీంతో సినిమా సెకండ్ హాఫ్ లో పట్టు సడలింది. విలన్ కి ఇచ్చిన బిల్డ్ అప్ కి చేసే పనులకి పొంతన కుదరదు. దీంతో థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఇంకా బాగా తీయొచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. అలాగని బాగాలేదన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ లో బాగా ఆశపెట్టి సెకండ్ హాఫ్ లో డిజప్పాయింట్ చేసినట్టు అనిపిస్తుంది.
ఈ సినిమాలో హైలైట్ అనుకోవాలంటే నాని, సాయి పల్లవి నటనతో పాటు విలన్ వేషం వేసిన విజయ్ వర్మ నటన. ఫస్ట్ హాఫ్ లో వినోదం, సినిమా అంతటా డైలాగ్స్ బాగా పేలాయి. ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం చాలా చోట్ల సినిమాకు ప్లస్ అయ్యింది. దిల్ రాజు నిర్మాణ విలువల గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమా కథ, నటుల విషయంలో తీసుకున్న జాగ్రత్త సెకండ్ హాఫ్ లో హీరో, విలన్ మధ్య సాగే కధనం మీద తీసుకుని ఉంటే ఇది కచ్చితంగా నానికి బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇప్పుడు జస్ట్ ఇంకో రొటీన్ సినిమా దగ్గరే ఆగిపోయింది.
తెలుగు బులెట్ పంచ్ లైన్…. మిడిల్ క్లాస్ అబ్బాయి జస్ట్ టైం పాస్ చేస్తాడు.
తెలుగు బులెట్ రేటింగ్… 2.75/5 .