మహిళ సజీవ దహనం

మహిళ సజీవ దహనం

విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధమైన ఘటనలో మహిళ సజీవ దహనం కాగా తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్‌ మండలం తిమ్మానగర్‌ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పోలబోయిన నర్సింహులు, మంగమ్మ దంపతులకు ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడు రవి ఉన్నాడు. ఇద్దరూ వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం పనులు ముగించుకొని తిరిగి ఇంటికొచ్చి రోజూ మాదిరిగానే నిద్రించారు.

ఈ క్రమంలో అర్ధరాత్రి 1 గంటకు నిద్రలో ఉండగా విద్యుత్‌ షాక్‌ జరిగి మంటలు చెలరేగాయి. అప్రమత్తమై తేరుకునే లోపే క్షణాల్లో పూరి గుడిసె మంటల్లో పూర్తిగా కాలిపోయింది. గుడిసెలో నిద్రిస్తున్న మంగమ్మ సజీవదహనం కాగా మృతురాలి భర్త నర్సింహులు, కుమారుడు రవికి 50 శాతానికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు మెదక్‌ డీఎస్పీ సైదులు, రూరల్‌ ఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.ఈ ప్రమాదంలో నిత్యావసర వస్తువులు, బట్టలు, ధాన్యం, వంట సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. మెదక్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సర్పంచ్‌ లక్ష్మితో కలిసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని పంచనామా నిర్వహించారు.