స్టార్ హీరోల పుట్టినరోజంటే హంగామా, సందడి అంతా వేరు. సామాజిక సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ వేడుకలు సర్వసాధారణం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సామూహికంగా పాల్గొనే కార్యక్రమాలు నిర్వహించడం కరెక్ట్ కాదని వాయిదా వేస్తున్నారు. అయితే అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా చూపిస్తున్నారు. సంబరాలన్నీ ఇంటర్నెట్ సాక్షిగా జరుపుకుంటున్నారు.
ఓ స్టార్ హీరో బర్త్‌డే అంటే ప్రత్యేకంగా డిజైన్ చేసిన సీడీపీ (కామన్ డిస్‌ప్లే పిక్చర్), మరియు హ్యాష్‌ట్యాగ్ విడుదల చేసి, ఆ సీడీపీనే తమ అకౌంట్స్ పిక్చర్స్‌గా మార్చుకుని ఆ ట్యాగ్‌ను ఉపయోగించి తమ ప్రేమను సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తుంటారు. ఈ ఏడాది చిరంజీవి బర్త్‌డే కామన్ డీపీను సుమారు వందమంది సెలబ్రీటీలతో విడుదల చేయిస్తున్నారు. వంద మందికి పైగా సెలబ్రీటీలు కామన్ డీపీను విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ సీడీపీ విడుదల చేసే వారిలో చిరుతో నటించినవారి దగ్గర నుంచి యంగ్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు.