మెర్సెల్ సినిమా రికార్డు కలెక్షన్స్ గురించి కాకుండా..ఆ చిత్రంలోని కొన్ని వివాదాస్పద డైలాగుల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీపై మెర్సెల్ లో విజయ్ క్యారెక్టర్ చెప్పిన డైలాగులపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. దీంతో వాటిని తొలగించేందుకు సినీ నిర్మాతలు అంగీకరించారు. ప్రజల ఆరోగ్య భద్రత గురించి విజయ్ మాట్లాడుతూ…7శాతం జీఎస్టీ వసూలు చేసే సింగపూర్ లో ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తున్నారు…
కానీ మనదేశంలో 28శాతం జీఎస్టీ వసూలు చేసే ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతుంది అని ప్రశిస్తారు. దీంతో పాటు..వ్యాధులకు వాడే మందులపై 12శాతం జీఎస్టీ విధించిన ప్రభుత్వం…ఆడపడుచుల కాపురాలు కూల్చే మందుపై మాత్రం జీఎస్టీ విధించలేదు అని విమర్శిస్తారు. ఈ డైలాగులు జీఎస్టీని తప్పుబట్టేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నేతలు మెర్సెల్ పై మండిపడుతున్నారు. బీజేపీ ఆగ్రహం నేపథ్యంలో సినిమాలోని ఈ డైలాగులు తొలగిస్తామని మెర్సెల్ నిర్మాత రామినేని ప్రకటించారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఆ డైలాగులు రాశాం తప్ప కేంద్ర విధానాన్ని తప్పుబట్టే ఉద్దేశాలు తమకు లేవని ఆయన వివరణ ఇచ్చారు.